-
-
Updated :
19 November 2025 11:35 AM
ఆయన భార్య మడకం రాజే, మరో నలుగురు కూడా
ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టుల మృతి
మారేడుమిల్లి అడవుల్లో తుపాకుల మోత
పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ హిడ్మా బృందం
ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు
వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు
మృతులంతా ఛత్తీస్‌గఢ్ వాసులే
అక్కడ నిర్బంధం పెరగటంతో ఏపీ వైపు రాక
వారి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు
రాజమహేంద్రవరం, అమరావతి, పాడేరు, రంపచోడవరం: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్‌వాంటెడ్ మద్వి హిడ్మా (51) భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మడకం రాజే, పీఎల్జీఏ ఒకటో నంబర్ కంపెనీలోని వివిధ ప్లటూన్లకు కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్మల్ ఎలియాస్ చైతు, కమ్లూ ఎలియాస్ కమలేష్, మల్లా ఎలియాస్ మల్లాలు, దేవేలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హిడ్మా రక్షణ దళంలో కీలక సభ్యులు. వీరంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందినవారే. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.30-7 గంటల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా మరో 19 మంది తప్పించుకున్నారు. వీరి కోసం భద్రత బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి మహేష్‌చంద్ర లడ్డా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్లు మంగళవారం ఉదయం రంపచోడవరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.