-
-
Updated :
20 November 2025 06:26 PM
వేళాపాళా లేని నిద్రాహారాలు.. కాలు కదపని కొలువులు.. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే జీవనశైలి.. వెరసి ఈతరం స్థూలకాయం బారిన పడుతోంది. ఆడామగా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదో ఎడతెగని సమస్యలా మారింది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు అంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. తెలుగు రాష్ట్రాల్లోనూ స్థూలకాయ బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉందనే విషయం ప్రస్ఫుటం. చిన్నారులనూ వదలని ఈ ఊబకాయం... ఒక్కసారి ఒంటిని చుట్టేస్తే కుదురుగా ఉండదుగా! మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, బీపీ, ఫ్యాటీ లివర్, క్యాన్సర్‌లాంటి ప్రమాదకరమైన రుగ్మతలనూ మోసుకొస్తుంది. మరి ఇంతటి భయంకరమైన ఊబకాయం మన దరికి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏమేం వ్యాయామాలు చేయాలి? జీవనశైలిలో చేయాల్సిన మార్పులేంటి? అందుబాటులో ఉన్న అధునాతన వైద్య చికిత్సలేంటి? ఈ వివరాలన్నింటిపై ‘ఈనాడు’ ప్రత్యేక ఉచిత వెబినార్ నిర్వహిస్తోంది. ప్రముఖ వైద్యనిపుణులు డా. రాకేశ్ కలపాల, డా.పి.వి.రావు, యోగా గురు శిరీష, పోషకాహార నిపుణురాలు డా. లతాశశి అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యాభిలాషులందరూ ఇందులో పాల్గొనవచ్చు. విలువైన సమాచారం తెలుసుకొని ఊబకాయం దరిచేరకుండా చూసుకోవచ్చు.